Monday, October 1, 2012

జగన్ కోసం -11

జగన్ విషయంలో సీబీఐ నిటారుగా నిలబడి దాని పని అది చేసుకుపోవడం లేదు. అది కాంగ్రెస్ హైకమాండ్ ముందు వంగి కాళ్ళకు దణ్ణం పెడుతోంది. ఇది దేశంలో ప్రధాన పత్రికలు తమకు తాముగా చెప్పిన మాట. నిజానికి ఈ కేసు జగన్ ఆస్తుల కేసు కాదు. ఇది 2004-2009 మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన 26 జీవోలు సక్రమమా లేక అక్రమమా తేల్చాలన్న కేసు...


ఈరోజు జగన్ బెయిల్ సుప్రింకోర్టులో విచారణకు రానున్నది. కచ్చితంగా నాలుగు నెలల క్రితం 27వ తేదీ సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో అరెస్టు సంగతి మాకు చెప్పారు. కొన్ని నెలలుగా వినబడుతున్న వార్తే అయినా - నేను, మా అత్తగారు ఆ మాట వినలేకపోయాం. దానిని వినడానికి సైతం మా మనసు ఒప్పుకోవడం లేదు. ఈరోజుకి అన్యాయంగా అరెస్టు చేసి 123 రోజులు. ఎలాంటి తీర్పు వస్తుందోనని మా కుటుంబంతోపాటు జగన్‌ను తమ ఇంటి బిడ్డగా భావించే కోట్లమంది ఎదురు చూస్తున్నారు. మన రాజ్యాంగం ప్రకారం, మన దేశ చట్టాల ప్రకారం జగన్‌కు బెయిల్ వస్తుందని, అలా రావాలని ఎంతోమంది తమ తమ పద్ధతుల్లో పార్థనలు చేస్తున్నారు. జగన్ పట్ల ప్రజలకు ఉండే ప్రేమనే ఈ పెద్దపెద్ద నాయకులు సహించలేకుండా ఉన్నారనుకంటా. అందుకే జగన్‌ను ఎలాగైనా తొక్కేయాలని పార్టీలకు అతీతంగా చేతులు కలుపుతూ, ఎలాగైనా సరే జగన్‌కు బెయిల్ రాకుండా చెయ్యాలని కష్టపడుతున్నారు. కాని వీళ్లు జగన్‌ను ఎంతగా తొక్కేయాలనుకుంటే దేవుడు, ప్రజలు అంతగా జగన్‌ను పైకి ఎత్తి పట్టుకుంటున్నారు.

ఒక్క జగన్‌కు వ్యతిరేకంగా ఈ మూడు సంవత్సరాలలో చేసిన కుట్రలు, కుతంత్రాలు, జగన్‌ను ఇబ్బంది పెట్టడానికి వారు చేసిన పనులు బహుశా మన దేశంలోనే కాదు... ప్రజాస్వామ్య చరిత్రలో ఎక్కడా జరగలేదనుకుంటా. ఒక అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసి ఒక్క మనిషిని (జగన్‌ను వీళ్లు టార్గెట్‌గా చేసుకున్నప్పుడు మొదట్లో జగన్‌కు వేరే పార్టీ కూడా లేదు) వేధించడం ఎక్కడా కనీవినీ ఎరుగలేదు. కాంగ్రెస్ మరియు టిడిపి ఏ ప్రజా సమస్యనో, ఏ అన్యాయానికి ప్రతిగానో చేసిన పోరాటం కాదిది. ప్రజల మనసులలో చెరగని వైయస్‌ఆర్ గారి ముద్రను తుడిచేయడానికి చేసిన ప్రయత్నం ఇది. ఒక చనిపోయిన మనిషిని గురించి ఎవ్వరు చెడుగా మాట్లాడరు. అది కనీస మానవత్వం. కానీ ప్రజల కోసం ప్రాణాలు పెట్టి తన జీవితం చివరి నిమిషం వరకు ప్రజలకోసం తపించిన మనిషిని ఎంత అన్యాయంగా మాట్లాడారు. ఆయన మీద వున్న ప్రేమను ప్రజలు జగన్‌పై చూపడం ఓర్చుకోలేకపోయారు. అందుకే ఆయనను ప్రజల మనసుల నుంచి తీసివేయాలని, జగన్‌ను ప్రజల ప్రేమకు దూరం చేయాలని ఇంతవరకు కథ నడిపించారు. ప్రజల పక్షాన నిలబడి తమను ఎన్నుకున్న ప్రజలకోసం పనిచేయవలసిన బాధ్యతను విస్మరించి, సినిమా విలన్ల కంటె అన్యాయంగా, వికృతంగా ప్రవర్తించారు. అందుకే ప్రజలు వారిని ఛీదరించుకుంటున్నారు. జగన్‌కు మేమున్నామంటూ వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు.

వైయస్సార్‌గారి మరణవార్త విని చనిపోయిన వారిని పరామర్శిస్తానని జగన్ వాళ్ల నాన్న మరణించిన స్థలంలో మాట ఇచ్చిన రోజున ఏ రాజకీయాలు లేవు. కల్మషం లేని మనసుతో వాళ్ల నాన్నకోసం ఇచ్చిన మాట ఇది. కానీ ఓదార్పు యాత్ర ప్రారంభిస్తానంటే సోనియాగాంధి గారు వద్దన్నారు. కాని ఆరోజు నేను జగన్‌తో ‘ఏమి చేద్దామనుకుంటున్నావు జగన్. ఇంత పెద్దవాళ్లు నిన్ను ఆపాలని వున్నారు’ అన్నాను. అందుకు జగన్ నాతో అన్న మాటలు నేను ఎప్పటికీ మరచిపోను. ‘నేను ఈరోజు నాన్నకు ఇచ్చిన మాట మీద నిలవకపోతే నాన్నకు ఏమని నేను సమాధానం చెప్పాలి’ అన్నాడు. ఇంక ఇంట్లో మేమెవరం అడ్డుచెప్పలేదు. అలా మొదలై, కొన్ని విధిలేని పరిస్థితులలో 2010 నవంబర్‌లో జగన్, అత్తమ్మగారు ఇద్దరూ కాంగ్రెస్ పార్టీకి తమ ఎంపి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. అలా కాంగ్రెస్ నుండి జగన్ బయటికి రావడం మొదలు సిబిఐ విచారణ పేరుతో కాంగ్రెస్, టిడిపి, ఎల్లో మీడియా కలిపి జగన్‌ను వేధించటం, పథకం ప్రకారం ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు.

అలా మొదలైన కేసుకు ఎల్లో మీడియా, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, సిబిఐ కలిసి జగన్ అక్రమ ఆస్తుల కేసు అని ప్రచారంలోకి తీసుకువచ్చాయి. నిజానికి ఈ కేసు జగన్ ఆస్తుల కేసు కాదు. ఇది 2004-2009 మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన 26 జీవోలు సక్రమమా లేక అక్రమమా తేల్చాలన్న కేసు. ప్రభుత్వ నియమ నిబంధనలను, ఇదివరకటి ప్రభుత్వాలు అనుసరించిన విధానాలను కాదని జీవోలు ఇచ్చి తద్వారా ఎవరికైనా అనుచిత లబ్ది చేకూర్చారా... అలా ఎవరైనా లాభం పొంది జగన్‌కు సంబంధించిన కంపెనీల్లో పెట్టుబడి పెట్టారా అన్నది కేసు. సిబిఐ దర్యాప్తు చేయాల్సినది అసలు ఈ జీవోలో ఎలాంటి తప్పు అయినా జరిగిందా, లేదా అన్నది. నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చినవా లేదా అని. కానీ సీబీఐ మొదటిరోజు నుంచి అలాంటి దర్యాప్తు చేయటానికి ఇష్టపడడం లేదు. అసలు జీవోల సంగతి పక్కనపెట్టి, మా ఇంటి మీద, ఆఫీసుల మీద పడ్డారు. కానీ, ఎవరు తప్పు చేశారో, ఎవరు తప్పు చేయలేదో నిర్ధారించడానికి ప్రయత్నించలేదు. కనపడిన ప్రతి పారిశ్రామికవేత్తనీ జగన్ పేరు చెప్పు.. 164 స్టేట్‌మెంటు ఇవ్వండి, మీకు ఏ ఇబ్బందీ ఉండదు - అంటూ బెదిరించింది. దీన్ని దర్యాప్తు అంటారా? సీబీఐ అలా దర్యాప్తు చేయవచ్చు అని ఏ చట్టం చెప్పింది? చివరికి నియంతృత్వ దేశాల్లో, నిరంకుశ దేశాల్లో కూడా ఇలా అధికారాన్ని ఒక మనిషికి వ్యతిరేకంగా ఇంత బాహాటంగా ఉపయోగించరేమో!

జగన్ కంపెనీల మీద జరిగిన అసత్య ప్రచారాలకు లెక్కే లేదు. కార్పొరేట్ సెక్టర్ గురించి అవగాహన ఉన్నవారికి, కంపెనీలు-పెట్టుబడుల గురించి, వాటాల అమ్మకం, ప్రీమియం నిర్ణయం గురించి తెలిసిన వారికి జగన్ చేసింది తప్పుకాదని తెలుసు. కానీ, ఆ వ్యవహారాలను వక్రీకరించారు. మీ కంపెనీకి ఇంత ప్రీమియం ఎలా నిర్ణయించారంటూ ప్రచారాలు ప్రారంభించారు. ఇందులో అందరూ గమనించాల్సిన అంశం ఏమిటంటే, జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వారంతా ఒకే ప్రీమియం చెల్లించారు. అలాంటప్పుడు కొందరు పారిశ్రామికవేత్తలు షేర్ల కొనుగోలు చేయటాన్ని క్విడ్ ప్రో కో అనే పదం పరిధిలో ఎలా చేర్చారు? ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినవారి షేర్ల సర్టిఫికెట్లు వారివద్దనే ఉన్నాయి. అదీకాక, లంచంగా తీసుకోదలచుకున్న వ్యక్తులు ఎవరైనా ఉత్తుత్తి కంపెనీలు సృష్టిస్తారుగానీ, నిజంగా భారీఎత్తున ఉత్పత్తి ప్రారంభించి మార్కెట్‌లో నిరూపించుకునే ప్రయత్నం చేస్తారా? జగన్ పెట్టిన సంస్థలేవీ ఉత్తుత్తి కంపెనీలు కావే! భారతి సిమెంటు కానివ్వండి, సాక్షి పత్రిక కానివ్వండి, టీవీ ఛానల్ కానివ్వండి... ఇవి దేశం మొత్తంమీద ఆదరణ పొందినవి, సాక్షి అయితే దేశంలోనే 8వ స్థానంలో ఉంది. భారతి సిమెంట్ యొక్క నాణ్యత దేశంలో అగ్రస్థానం.

ఇక ప్రీమియం విషయానికి వస్తే, ఈనాడుకు పోటాపోటీగా సర్క్యులేషన్ ఉన్న సాక్షిలో ప్రీమియంను ప్రశ్నిస్తున్నవారు మరికొన్ని అంశాలను ఉద్దేశపూర్వకంగా చూడకుండా కళ్లు మూసుకున్నారు? ఈనాడు మాతృ సంస్థ అయిన ఉషోదయా పబ్లికేషన్స్ తన 26 శాతం వాటాను జెఎం ఫైనాన్షియల్స్‌కు అమ్ముతున్నప్పుడు సాక్షి కంటే డబుల్ వాల్యుయేషన్ చేసి 100 రూపాయల షేర్‌ను 5,28,000కు వెలకట్టి అమ్మడం జరిగింది. రామోజీ హెచ్‌యుఎఫ్ పేరిట అప్పటికి రూ.1800 కోట్ల మేరకు నష్టాలు పేరుకుని ఉన్నా, అంత ప్రీమియం ఎలా పలికింది? తప్పే అయితే ఎందుకు ఈ విషయం మీద దర్యాప్తు జరగడం లేదు?

అలాగే, భారతి సిమెంట్‌లో వాటాలు కొనుగోలు చేసిన నిమ్మగడ్డ ప్రసాద్‌గారు, ఇండియా సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్ క్విడ్ ప్రో కోగా పెట్టుబడులు పెట్టారు కాబట్టే జగన్ నిర్ణయించిన ఎక్కువ ప్రీమియంకు వారు షేర్లు కొన్నారని మొదట్లో ప్రచారం చేశారు. తరువాత, భారతి సిమెంట్‌లో 51 శాతం వాటాను అంతకంటె భారీ ధరకు ఫ్రెంచి సిమెంట్ జెయింట్ వికాకు అమ్మినప్పుడు, ఈ పెట్టుబడిదార్లందరికీ దాదాపుగా రెట్టింపు లాభాలు వచ్చాయి. ఎక్కడో ఫ్రాన్స్ నుంచి వచ్చిన వికా చెల్లించిన ప్రీమియం కూడా క్విడ్ ప్రో కోనే అంటారా?

ఏదైనా జీవో జారీ చేయాలంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన బిజినెస్ రూల్స్ ప్రకారంగానే జీవోలు జారీ అవుతాయి. అలా బిజినెస్ రూల్స్ ప్రకారం మంత్రి ఆమోదంతో, సంబంధిత శాఖ కార్యదర్శి జీవోలు జారీ చేస్తారు. ప్రభుత్వ నిబంధనలు ఇంత స్పష్టంగా ఉన్నాగానీ, జీవోలు జారీ చేసే అధికారం లేని డాక్టర్ వైఎస్ గారి పేరును సీబీఐ వారు నేరపూరితమైన కుట్రకు పాల్పడిన వ్యక్తిగా, అదీ ఆయన మరణానంతరం ఎందుకు చేర్చారు? రూ.1.75లక్షల కోట్ల టెలికాం కుంభకోణంలో కేంద్రంలో సంబంధిత మంత్రిగా ఉన్న రాజా, సంబంధిత శాఖ కార్యదర్శి మాత్రమే నిందితులు. ప్రధాని పేరును ఆ దర్యాప్తులో చేర్చలేదే? అలాగే, 1.85 లక్షల కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణం సమయంలో ప్రధాని సంబంధిత శాఖను నిర్వహించినా, ఆయనకు సంబంధం లేదని కాగ్ నివేదిక చెప్పలేదా? దేశం పరువును అంతర్జాతీయ స్థాయిలో దిగజార్చిన కామన్‌వెల్త్ స్కామ్‌లో ప్రధానిని విచారించారా? లేదే? ఎందుకని? ఎందుకంటే, సీబీఐ నేరుగా ప్రధాని అదుపాజ్ఞల్లో పని చేస్తుంది కాబట్టి. దివంగత నేత పేరును చేర్చడానికీ కారణం అదే.

ఈ కేసులో మంత్రుల్ని గానీ, సెక్రెటరీలను గానీ విచారించారా? అని సుప్రీంకోర్టు ఈ ఏడాది మార్చి 30న దాఖలైన పిటిషన్ సందర్భంగా అడిగింది. వారి పేర్లు ఎందుకు చేర్చలేదో చెప్పండని ప్రశ్నించింది. ఆరు నెలలు గడిచినా వీరి నుంచి ఎలాంటి సమాధానమూ లేదు. జీవోలు తప్పా ఒప్పా అన్న ఊసే లేకుండా సీబీఐ 28 టీములు పెట్టి, భారతదేశ చరిత్రలో ఏనాడూ లేని విధంగా మా ఇంటిమీద, ప్రత్యేకించి కొందరు ఇన్వెస్టర్ల ఇళ్ళూ ఆఫీసుల మీద దాడి చేసింది. మా ఇంటిని అంగుళం అంగుళం కొలతలు తీసుకుంది. జీవోలు జారీ చేసిన మంత్రులు, సెక్రెటరీల ఇళ్ళమీద ఏనాడూ దాడి చేయలేదే! బోఫోర్స్‌కు మించిన కుంభకోణం ఈ దేశ చరిత్రలో మరేదీ లేదే. అయినా ఏనాడూ పకడ్బందీ సాక్ష్యాధారాల కోసం సోనియాగాంధీ ఇంటిమీద దాడి చేయలేదే? ఆదర్శ్ కుంభకోణానికి సంబంధించి అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర క్యాబినెట్‌లో పెద్దల హస్తం కూడా కనిపిస్తున్నా సీబీఐ వారి ఇళ్ళలో ఏ ఒక్కదాని మీదా ఈ రోజుకూ దాడి చేయలేదే? ఇదేం న్యాయం - ఒకరికి ఒక రూలు ఇంకొకరికి మరో రూలు - ప్రజాస్వామ్యంలో ఇదెలా సాధ్యం?

మన రాష్ట్రాన్నే చూడండి. రోశయ్యకు వ్యతిరేకంగా పెట్టిన ఏసీబీ కేసుకు ఏ గతి పట్టింది? సోనియా ముందు వంగి విధేయత ప్రదర్శించిన కాంగ్రెస్ వాది కాబట్టి ఆయన ఇంటిమీద ఎలాంటి సోదాలూ లేవు. ఆయన మీద కేసూ పోయింది. పైగా గవర్నరు గిరీ దక్కింది. ఇలాంటి ఎన్నెన్నో ఉదాహరణలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఈ దేశంలో న్యాయం సమంగా అందరికీ వర్తిస్తుందని చెప్పేవేనా? సీబీఐ ఈ కేసును కేవలం తన రాజకీయ యజమానుల్ని ఒప్పించడానికి ఉపయోగించినట్టయితే, జగన్‌తో కలిసి కుట్ర పన్నారంటూ నాలుగు చార్జిషీట్లలో నిందితుల జాబితాలో తానే పేర్కొన్న దాదాపు అందరికీ న్యాయస్థానం బెయిల్ ఇస్తున్నప్పుడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? వారంతా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తులు కారా? వీరిలో ఉన్న మంత్రులకు గణనీయమైన అధికారం లేదా?

జగన్‌కు బెయిల్ ఇవ్వటానికి వీల్లేదంటూ అందుకు సీబీఐ చూపుతున్న కారణాలే అర్థంపర్థం లేనివి. జగన్ ఎంపీగా ఉన్నాడు కాబట్టి ఆయన సాక్షుల్ని, సాక్ష్యాన్ని ప్రభావితం చేయగలడట! కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు అయిన 280 రోజుల వరకు సాక్షుల్ని ఎలాంటి ప్రభావానికి గురి చేయకుండా ప్రజల్లో తిరిగిన నాయకుడు, అధికారంలో లేకపోవడమే కాకుండా అధికార పక్షం నేరుగా టార్గెట్ చేస్తున్న వ్యక్తి ఏ సాక్షుల్ని అయినా ఎలా ప్రభావితం చేయగలుగుతాడు? సీబీఐ దర్యాప్తు ప్రారంభం అయ్యి 13 నెలలు గడిచింది. సీబీఐ 1, 2, 3 ఛార్జిషీట్లంటూ వేసింది. ఆ ఛార్జిషీట్లు వేస్తున్న సమయంలో జగన్ నిర్బంధంలో లేడు. తరవాత కూడా జగన్ తప్పు చేశాడని సీబీఐకి ఎలాంటి ఆధారమూ లభించలేదు.

జగన్‌మోహన్‌రెడ్డి విషయంలో సీబీఐ నిటారుగా నిలబడి దాని పని అది చేసుకుపోవడం లేదు. అది కాంగ్రెస్ హై కమాండ్ ముందు వంగి కాళ్ళకు దణ్ణం పెడుతోంది. ఇది దేశంలో ప్రధాన పత్రికలు ద హిందూ,ఇండియా టుడే, టైమ్స్ ఆఫ్ ఇండియా తమకు తాముగా చెప్పిన మాట. ఇన్ని జరుగుతున్నా ఈ దేశంలో న్యాయస్థానాల మీద, న్యాయ వ్యవస్థ మీద మాకు విశ్వాసం పోలేదు. వాటిని కాదని మేం చేయగలిగినదీ లేదు. న్యాయం వర్థిల్లాలని మాత్రమే కోరుకుంటున్నా.



- వైఎస్ భారతి
w/oవైఎస్ జగన్









No comments:

Post a Comment