Monday, October 1, 2012

జగన్ కోసం -3

వైఎస్‌ఆర్‌సిపి మీద ఇవాళ జరుగుతున్న ప్రచారం చూస్తే నాకు 2011 కడప ఎలక్షన్ గుర్తుకు వస్తోంది. అప్పుడూ ఇంతే. అబద్ధాలను ప్రచారం చేసి గెలవాలనుకున్నారు. కానీ ప్రజలకు తెలుసు - ఎవరు మాట మీద నిలబడతారో, ఎవరు మాట కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమవుతారో.

ఆ రోజు బిజెపితో పొత్తు అన్నారు. అంతలోనే కాంగ్రెస్‌తో పొత్తు అంటున్నారు. ఉపఎన్నికలలో 15 సీట్లు వచ్చిన వైయస్‌ఆర్‌సిపికి 2 సీట్లు వచ్చిన కాంగ్రెస్‌తో ఏమి అవసరం వుంటుంది? నిజానికి ఈ తప్పుడు కేసులు ఇప్పుడు మొదలు కాలేదు... కడప ఎలక్షన్స్‌కు ముందే మొదలయ్యాయి. కాని మేము భయపడలేదు. ఈరోజు కూడా భయపడవలసిన అవసరం మాకు లేదు. ఎందుకంటే మామగారు గాని, జగన్‌గాని ఏ తప్పు చేయలేదు కనుక. దాచిపెట్టి, చీకటిలో చాటుమాటుగా పనులు చేసే అలవాటు మామగారికి కాని, జగన్‌కు కానీ లేవు కనుక.

కడప ఎలక్షన్స్‌కు 20 మంది మంత్రులు సూట్‌కేసుల నిండా డబ్బులు తెచ్చి, ఓటర్లను గందరగోళ పరచాలని 10 మంది విజయమ్మ పేరు గలవారి చేత, 16 మంది జగన్‌మోహన్‌రెడ్డి పేరు గలవారి చేత నామినేషన్స్ వేయించారు. జగన్ చిన్నాయననే జగన్‌కు ప్రత్యర్థిగా ఉసిగొలిపారు. నీచ రాజకీయాలు చేశారు. జగన్ ఒక్కడు - వాళ్లు అంతమంది. అయినా దేవుని దయతో, ప్రజల ప్రేమాశీస్సులతో కనీవినీ ఎరుగని మెజారిటీలతో ప్రజలు తల్లిని, బిడ్డను దీవించారు.

ఇప్పుడు కూడా ఇన్ని కుట్రలు జరుగుతున్నా, తప్పుడు కేసులు పెట్టి బెయిల్ రాకూడదని అధికార, ప్రతిపక్షాలు నానాతంటాలు పడుతున్నా నా మనస్సుకు ఇదే ధైర్యాన్ని ఇస్తోంది- దేవుడు ఉన్నాడని, ఆయనను నమ్ముకున్న వాళ్లకు ఆయన ప్రతిఫలం దయచేస్తాడని. అన్యాయం జరుగుతూ వుంటే ప్రజలు చూస్తూ వుండరని - ఈ కుట్రలు తప్ప వేరొకటి తెలియని నీచ రాజకీయ నాయకులకు తప్పకుండా బుద్ధి చెప్తారని నా నమ్మకం.

అన్యాయం కాకపోతే చూడండి... రాజీవ్‌గాంధి చనిపోయాక బోఫోర్స్ కేసులో సిబిఐ ఆయన పేరును ఛార్జిషీటు నుంచి తొలగించడం మనం చూశాం. ఇప్పుడు ఒక నేత చనిపోయిన తర్వాత ఎఫ్‌ఐఆర్‌లో ‘ప్రభుత్వం’ అనే మాట తీసివేసి చనిపోయిన ఆ నేత పేరును పెట్టడం చూస్తున్నాం. ఎమ్మార్ కేసులో తప్పుచేసిన చంద్రబాబు వంటి వారిని కనీసం విచారణకు కూడా పిలవని పరిస్థితులను కూడా చూస్తున్నాం.

ఇంటికి పెద్దదిక్కయిన భర్తను పోగొట్టుకున్న ఒక ఆడమనిషికి మగదిక్కయిన ఒక్క కొడుకును కూడా తీసుకెళ్లి అప్రజాస్వామికంగా, అన్యాయంగా జైలులో పెట్టి వింత చూస్తున్న ఈ అధికార, విపక్షాల వికృత చేష్టలను ప్రజలు గమనిస్తున్నారు. దేవుడు చూస్తున్నాడు. సమయం వచ్చినప్పుడు వాళ్లు తప్పక ఊహించని రీతిలో జగన్‌ను ఆశీర్వదిస్తారు.

అసలు వీళ్లకు నీతి న్యాయాలు జరగాలని కాదు తపన - జగన్‌ను ఎలా ఇబ్బందిపెట్టాలా అనేదే వీళ్ల లక్ష్యం. బెయిల్ అనేది 90 రోజుల తరువాత రాజ్యాంగం ప్రతి పౌరునికి కల్పించే హక్కు. అటువంటిది అక్రమంగా అరెస్టుచేసి 114 రోజులు దాటుతూ వుంది. అయినా సరే- ఇప్పుడు బెయిల్ రాబోతూ ఉందంటే దానికి కూడా ఉద్దేశాలు ఆపాదిస్తారా? కలిసిపోయారు అంటారా? మాకు మీ మాదిరి అధికారం లేదు, అధికారంలో వుండే వాళ్లతో చీకటి పొత్తులు లేవు. కాని దేవుడు ఉన్నాడు, ప్రజలు న్యాయం చేస్తారు అనే నమ్మకం మమ్మల్ని 3 నెలలు దాటినా నడిపిస్తున్నాయి.

ఆలోచించండి. ఎవరితోనైనా పొత్తు పెట్టుకొని ఉంటే జగన్ ఇలా ఉండేవాడా? ఎమ్మార్ సంస్థకు భూములు కేటాయించిన చంద్రబాబులా అరెస్టు కాదు కదా కనీసం ప్రశ్నించను కూడా ప్రశ్నించకుండా దర్యాప్తు ముగించేలా మాట్లాడుకుని దర్జాగా బయట వుండడా? ఇలా కేసులలో ఉంటాడా? పొత్తు వుంటే జైలుకు వెళతాడా?

పాఠకులకు ఆహ్వానం: జగన్ పక్షాన, జనం పక్షాన నిలబడి వాదన వినిపించాలనుకుంటున్న పాఠకులకు ఆహ్వానం. జగన్ అక్రమ అరెస్టును, వైఎస్ కుటుంబంపై సాగుతున్న వేధింపులను, ప్రత్యర్థుల ప్రచారాన్ని ఎండగట్టే మీ మీ వాదనలను మాకు రాయండి. మీ అభిప్రాయాలు చేరవలసిన చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1,బంజారాహిల్స్, హైద్రాబాద్-34.


source: http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=49283&Categoryid=11&subcatid=22


No comments:

Post a Comment